- గ్రామాల్లో మ్యాపింగ్ చేసుకోవడంతో సిటీలో తగ్గినయ్
- పర్మనెంట్ షిఫ్టెడ్ కింద 45.18 లక్షల ఓట్ల గాయబ్
- ఇందులో 40 శాతం ఓట్లు ఏపీ వాళ్లవే!
- ఏపీ వాళ్లు ఎక్కువున్న నియోజకవర్గాల్లో భారీగా తగ్గిన ఓట్లు
హైదరాబాద్, వెలుగు: అనుకున్నట్లే జరిగింది. రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓట్లు పట్టణాల నుంచి గ్రామాలకు షిఫ్ట్ అయ్యాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంత జిల్లాల్లో నివాసం ఉంటున్న లక్షల మంది వారి గ్రామాల్లో ఉన్న ఓటుతో పాటు ఇక్కడా ఓటు హక్కును కలిగి ఉన్నారు.
సర్‌లో భాగంగా ఏదో ఒకచోటే ఓటును కొనసాగించే పరిస్థితి ఉండడంతో సిటీలో ఓటును వదులుకుని పల్లెల్లోనే మ్యాపింగ్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓటర్ల మ్యాపింగ్ భారీగా తగ్గింది. మంగళవారం ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో భాగంగా డ్రాప్ట్ ఓటర్ల జాబితాలో చోటు దక్కని ఓటర్ల వివరాలను ప్రకటించింది.
ఇందులో ‘పర్మినెంట్ షిఫ్టెడ్’ (శాశ్వత నివాస మార్పు) కేటగిరీ కింద అత్యధికంగా 45.18 లక్షల ఓటర్లు, ఆబ్సెంట్, అన్‌ట్రేసబుల్ (చిరునామాలో లేనివారు, జాడ లభించనివారు) కేటగిరీలో నమోదైన మరో 11.25 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ రెండింటిలోని ఓట్లలో అత్యధికం పల్లె ప్రాంతాలతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తొలగించనున్న 73.39 లక్షల ఓట్లలో దాదాపు 40 శాతం ఓట్లు గ్రామాలు, ఏపీ ప్రాంతాలకు చెందినవేనని తెలిసింది.
అక్కడ, ఇక్కడ ఓట్లు ఉన్నోళ్లు ఇక నగరాల్లో ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్న అనేకమంది ఓటర్లు తమ సొంత ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఓటును మ్యాపింగ్ చేసుకోవడంతో హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో వారి ఓట్లు డిలీట్ అయ్యాయి. కాగా ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ‘క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్’ (అభ్యంతరాలు, ఫిర్యాదుల) ప్రక్రియ ద్వారా అర్హులైనవారు తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రెండూ చోట్ల ఓట్లు ఉన్నోళ్లు ఒక దగ్గరే ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో ఇంకో ప్రాంతంలో వాటిని పట్టించుకోకపోవడంతో ఆబ్సెంట్, అన్‌ట్రేసబుల్ కింద నమోదయ్యారు. మరికొన్ని పర్మినెంట్ షిఫ్టెడ్ కిందకు వెళ్లిపోయాయి. ఉపాధి, వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో నివాసముంటున్న ప్రజలు.. పండుగలు, ఎన్నికల సమయంలో తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు.
చాలామంది ఓటర్లు నగరాల్లో కన్నా తమ స్వగ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంతో గ్రామాల్లో తమ ఓటును మ్యాపింగ్ చేసుకున్నారు. ఫలితంగా ఆ ఓట్లను పర్మినెంట్లీ షిఫ్టెడ్, అన్ రీచెబుల్, డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీల కింద నమోదు చేశారు. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు స్పష్టం అవుతుండగా, అదే గ్రామాల్లో మాత్రం స్థిరంగా ఉండటమే ఇందుకు ఉదాహరణ.
ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక కుటుంబాలు అటు ఏపీతో పాటు ఇటు కూడా కొత్త ఓటు కార్డులను నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం చెల్లదు. 2002 వివరాలతో ఓటరు మ్యాపింగ్, ఆధార్ అనుసంధానం, సాఫ్ట్‌వేర్ డేటా విశ్లేషణ ద్వారా ఇక్కడి ఓట్లను ఎన్నికల సంఘం డిలీట్ చేసింది.
శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిని బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్)ల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నోటీసులు ఇచ్చిన అనంతరం ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకూడదనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ నెల 17వ తేదీ నుంచి ‘క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్’ స్వీకరించనున్నారు.
ఈ గడువులోగా చిరునామా మారినవారు, జాబితాలో పొరపాటున పేర్లు పోయినవారు ఫారం-6, ఫారం-8 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. తగిన నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే పరిశీలన అనంతరం వారి పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో పునరుద్ధరిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లందరూ ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
